దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడి కోసం అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో రెడ్‌జోన్లు, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లుగా విభజించిన 13,750 ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు, నిత్యవసరాలు సరఫరా చేయడానికి 14 వేలమంది ఫుడ్ సప్లయర్లను రంగంలోకి దింపుతున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచి వీరు వారియర్స్‌లా తమ విధులు మొదలు పెట్టనున్నారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
టీమ్స్‌గా పనిచేసే ఈ వారియర్స్ ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తూనే కరోనా అనుమానిత వ్యక్తులను ఓ కంట కనిపెడుతుంటారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే సమచారాన్నిహెల్త్ టీమ్స్‌కు అందిస్తారు. ఈ వారియర్స్‌ని కంటైన్‌మెంట్ అండ్ సర్వైలెన్స్ టీమ్స్‌గా పిలుస్తారు. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరిని పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. ఆ బూత్ లెవెల్ ఏరియాలో వీళ్లు పెట్రోలింగ్ చేస్తారు. స్థానికుల్ని కలుస్తారు. ఒక్కో టీమ్ 500 కుటుంబాల ప్రజలను కలుస్తుంది.
ప్రతి టీమ్‌లో ఒక కానిస్టేబుల్, శానిటేషన్ వర్కర్, సివిల్ డిఫెన్స్ వాలంటీర్, ఆశా హెల్త్ వర్కర్ లేదా అంగన్ వాడీ వర్కర్ ఉంటారు. దేశంలో ఇలా గ్రౌండ్ లెవెల్లో కరోనా కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది తామేనని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,510కి చేరుకోగా, వారిలో 30 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 28 మంది చనిపోయారు.